
ప్రేమించాలని బాలికపై యువకుడి దాడి
కేతేపల్లి: తనను ప్రేమించాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలానికి చెందిన కొరివి మధు అనే యువకుడు గ్రామంలోని బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు లోపలికి ప్రవేశించాడు. తనను ప్రేమించాలని బాలికను బెదిరించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించి, కత్తితో బాలికపై దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు కేతేపల్లి ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భువనగిరిటౌన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. భువనగిరికి చెందిన యాకుబ్(38) భువనగిరి పట్టణంలో చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. మూడు రోజుల క్రితం యాకుబ్ తన దుకాణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కారు ఢీ కొట్టడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. అతడికి భార్య, సంవత్సరంన్నర కుమార్తె ఉంది.