
చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్!
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజనసాయి మెడోస్ వెంచర్‌లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చేతిలో మారణాయుధాలతో ముగ్గురు దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని బంధువుల నివాసంలో జరిగిన ఫంక్షన్ కోసం ఈనెల 16న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా తెరిచి చూడగా.. 8గ్రాముల బంగారం, 8.5తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.
చెడ్డీగ్యాంగ్ పనేనని అనుమానం
ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒక వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో మారణాయుధాలు పట్టుకున్నారు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్‌చల్ చేశారా అని తెలియాల్సి ఉంది. బాధితుడు డొప్ప నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
చౌటుప్పల్‌లోని అంజనసాయి
మెడోస్ వెంచర్‌లో ఘటన