
అధిక వడ్డీ కేసులో మరో నలుగురి అరెస్టు
పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశచూపి అమాయక గిరిజనులను మోసం చేసిన బాలాజీనాయక్ కేసులో మరో నలుగురు ఏజెంట్లను శుక్రవారం గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మౌనిక కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ వినోద్, రమావత్ సురేష్, రమావత్ రమేష్, రమావత్ చిరంజీవి అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీనాయక్‌కు ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. వీరిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు ఈ నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ6 కోట్ల 77 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. ఇప్పటికే బాలాజీనాయక్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కేసు విచారణను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 310 మంది బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారని తెలిపారు. సమావేశంలో సీఐ నవీన్‌కుమార్, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి ఎస్‌ఐలు అజ్మీరా రమేష్, మధు, నరసింహులు, నల్లగొండ స్పెషల్ టీం ఎస్‌ఐ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
రూ.6.77కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం
కొనసాగుతున్న విచారణ
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మౌనిక