
రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రమంతా ఒకేలా నిర్మించాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రమంతటా ఒకేలా నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో వారిని కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన పోరాటానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కొన్ని పరిశ్రమలకు ప్రయోజనం కల్పించడం, కొంత మంది బడా వ్యక్తులకు మేలు చేకూరేలా అలైన్‌మెంట్‌ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ను శాసీ్త్రయంగా నిర్మించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తక్కువ ధరకు లాక్కోవాలని చూడడం భావ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, నిర్వాసితులు నడికుడి అంజయ్య, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పల్లె శేఖర్‌రెడ్డి, జాల వెంకటేశ్, జాల శ్రీశైలం, సందగళ్ల మల్లేష్, నాగవళ్లి దశరథ, నెల్లికంటి నాగార్జున, భరత్, శ్రీనివాస్, బద్రుద్దీన్, నవీన్ తదితరులున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ
సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి