
పత్తి రైతుకు దక్కని మద్దతు
నల్లగొండ అగ్రికల్చర్ : పత్తి రైతులకు మద్దతు ధర అందడంలేదు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేశారు. ఈసారి అధిక వర్షాల కారణంగా సగానికి సగం పత్తిచేలకు నష్టం వాటిల్లి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే జిల్లా వ్యాప్తంగా 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటేన అంచనాలో సగం దిగుబడి వచ్చేలా లేదని అధికారులే అంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పత్తి దశ పత్తి ఏరడం పూర్తయి రెండవ దశ కూడా ఏరడం మొదలు పెట్టారు. దిగుబడి చేతికొస్తున్నప్పటికీ జిల్లాలో నేటికీ సీసీఐ(కాటన్ కార్పొషన్ ఆఫ్ ఇండియా) వారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.8,100 మద్దతు ధర ప్రకటించింది. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా పత్తి రైతులు కూలీలకు చెల్లించాల్సిన డబ్బుల కోసం వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
దగా చేస్తున్న వ్యాపారులు
కూలీలకు కూలీ డబ్బులను చెల్లిస్తేని తిరిగి రెండవ విడత పత్తిని తెంపడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వలేని రైతులు విధిలేక వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన 8,100 రూపాయల మద్దతు ధర చెల్లించకుండా తేమ శాతం, వివిధ కారణాలు చూపుతూ క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేలకే కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల ఏర్పాటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ రైతులను నట్టేటా ముంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 40వేల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలు..
జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అయినప్పటికీ దీపావళి పండగ తర్వాతే కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మునుగోడు పరిధిలోని ఓ జిన్నింగ్ మిల్లులో వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి
ఫ తెరుచుకోని సీసీఐ కేంద్రాలు..
ప్రారంభంకాని కొనుగోళ్లు
ఫ గత్యంతరం లేక వ్యాపారులకు
పత్తి అమ్ముతున్న రైతులు
ఫ క్వింటా రూ.5 వేల నుంచి
రూ.6 వేలకే ఖరీదు
ఫ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,100
పత్తిసాగు విస్తీర్ణం 5.64 లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా 45 లక్షల క్వింటాళ్లు