
నేడు తిప్పర్తికి మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం తిప్పర్తి మండలానికి రానున్నారని మంత్రి క్యాంప్ కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. మంత్రి హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు తిప్పర్తికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి తిరిగి హైదరాబాద్ వెళతారని పేర్కొన్నారు.
భోజన మెనూ పాటించాలి
నార్కట్‌పల్లి: మధ్యాహ్న భోజన నిర్వాహకులు మధ్యాహ్న మెనూ పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ భిక్షపతి ఆదేశించారు నార్కట్‌పల్లి మండలం నెమ్మాని జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెమ్మాని పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు త్వరలోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట పాఠశాలల హెచ్‌ఎంలు నీరజ, హేమలత, ఉపాధ్యాయులు ఉన్నారు.
టెండర్ దక్కేలా చూడు తల్లి!
కనగల్: మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని గురువారం పలువురు మద్యం టెండర్ దారులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా టెండర్ పత్రాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. టెండర్ దక్కేలా చూడు తల్లి అన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
నల్లగొండ: ఈనెల 18న చేపట్టనున్న బీసీల బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వనుందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ ప్రకటించారు. గురువారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందని తెలిపారు. ఈ నెల 18న జరిగే బీసీల బంద్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, కత్తుల కోటి, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్‌రెడ్డి, కేవీఆర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రెండు గేట్ల ద్వారా
మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం మూసీ రిజర్వాయర్‌కు 3,613 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 2,748 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపీజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు నీటిమట్టం 644.40 అడుగుల(4.30టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

నేడు తిప్పర్తికి మంత్రి కోమటిరెడ్డి

నేడు తిప్పర్తికి మంత్రి కోమటిరెడ్డి