
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
చిట్యాల : చిట్యాల పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గతంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గోగికార్ మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం డీఈఓ భిక్షపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు చిట్యాల ఎంఈఓ పానుగోతు సైదానాయక్ తెలిపారు. గతంలో చిట్యాల జెడ్పీహెచ్‌ఎస్ ఇన్‌చార్జి హెచ్‌ఎంగా మాధవి పని చేసిన సమయంలో పాఠశాలకు మంజూరైన పీఎంశ్రీ నిధుల దుర్వినియోగానికి గురైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. డీఈఓ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టగా వారిపై మాధవి దురుసగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగింది. దీంతో సంబంధిత విచారణ అధికారులు జిల్లా అకౌంట్స్ అండ్ పైనాన్స్ అధికారి సిహెచ్.యోగేంద్రనాథ్, చిట్యాల ఎంఈఓ సైదానాయక్ ఈ సంఘటనపై డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో శాఖా పరమైన చర్యల్లో భాగంగా డీఈఓ భిక్షపతి మాధవిని ఉద్యోగ సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
కొండమల్లేపల్లి (చింతపల్లి) : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని వెంకటేశ్వరనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పోలేపల్లి రాంనగర్‌లోని పల్లె దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలని, మలేరియా, డెంగీ తనిఖీ పరీక్షల కోసం అందుబాటులో ఉన్న ఆర్డీటీ నిల్వలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఉప వైద్యాధికారి కళ్యాణ్‌చక్రవర్తి, మండల వైద్యాధికారి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
ఉపాధి శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : నల్లగొండ శివారులోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీ ణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు గల నల్లగొండ, సూర్యాపేట, యదాద్రి భువనగిరి జిల్లాల వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు సంస్థ ఆఫీసులో సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 970100 9265 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
అధికారుల సూచనలు పాటించాలి
భువనగిరి : పంటల సాగులో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాకాద్రి రైతులకు సూచించారు. భువనగిరి మండలం వీరవెల్లి, కూనూరు గ్రామాల్లో బుధవారం ఆయన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఆయా పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ యే పంటలు సాగు చేశారు. పంటల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రైతులు ఉన్నారు.