
సమాజంలో గురువు స్థానం గొప్పది
మంచి విద్య అందిస్తే పిల్లల గుండెల్లో నిలిచిపోతారు : కలెక్టర్
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నల్లగొండ : అమ్మానాన్న తర్వాత స్థానం గురువులకే ఇచ్చారని.. సమాజంలో గురువుకున్న స్థానం గొప్పదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన్నవెంకట్‌రెడ్డి పంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చాటి చెప్పారన్నారు. గురువు.. మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని బోధించే వ్యక్తి అన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిబారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర గొప్పదన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఒక్కో నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్నామని తెలిపారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించి మెరుగైన బోధనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మంచి పౌరులను అందించడంలో గురువుల పాత్ర ముఖ్యమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు వెచ్చించి వాటిని బాగుచేయడం గొప్ప విషయమన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే పిల్లలు మరిచిపోరని వారిని గుండెల్లో పెట్టుకుంటారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ప్రస్తుతం 12 శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. అదే విధంగా భవిత కేంద్రాలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవరకొండ ప్రాంతం నుంచే ఎక్కువ మంది డిప్యుటేషన్ అడుగుతున్నారని అలాంటప్పుడు అక్కడి విద్యార్థులకు విద్య అందడం ఎలా.. వారికి అన్యాయం జరగకండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, డీఈఓ భిక్షపతి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పాల్గొన్నారు.

సమాజంలో గురువు స్థానం గొప్పది