
గంగ ఒడికి గణపయ్య
5,984 విగ్రహాలు
నల్లగొండ పాతబస్తీ వినాయకుడి విగ్రహం వద్ద లడ్డూ వేలం పాటలో రూ.5,00.116 పలికింది. పాతబస్తీకి చెందిన బొడ్డుపల్లి సతీష్ వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అయితే గతేడాది ఇక్కడ విగ్రహం వద్ద లడ్డూ రూ.13 లక్షల 50 వేలు పలికింది. కానీ ఈసారి జరిగిన వేలం పాటలో తక్కువ మంది పాల్గొనడంతో వేలంలో తక్కువ ధర పలకడంతో నిర్వాహకులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఫ కనులపండువగా గణేష్ శోభాయాత్ర
ఫ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
ఫ తీనార్మర్ స్టెప్పులు, కోలాటాలతో అలరించిన యువత
ఫ రాత్రి వరకు కొనసాగిన నిమజ్జనాలు
రామగిరి (నల్లగొండ) : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వెళ్లిరావయ్య గణపయ్య అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో గణేష్ నిమజ్జనం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలను ఉంచి మహిళల కోలాటాలు, వాహనాలకు మైకులు, డ్రమ్స్‌తో యువత తీన్మార్ స్టెప్పులతో గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే నిమజ్జనం సందడి కనిపించింది. మొదట తొమ్మిది రోజుల పాటు గణపయ్య చేతులో ఉంచిన లడ్డూలకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పలువురు పాల్గొని రూ.లక్షల్లో వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. పలు చోట్ల లక్కీ డ్రా తీసి డ్రాలో వచ్చిన టోకెన్ ఆధారంగా భక్తులకు లడ్డూలు అందజేశారు.
జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్ ఒకటవ నెంబర్ విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని విగ్రహాలు క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నాయి. వాటిలో పది అడుగుల లోపు ఉన్న విగ్రహాలను నల్లగొండ పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువులో, పది అడుగులలోపు విగ్రహాలను 14వ మైలు వద్ద నిమజ్జనం చేశారు. శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో ప్రాధాన వీధులు కిక్కిరిశాయి.
నిఘా నీడన శోభాయాత్ర..
గణేష్ నిమజ్జన శోభాయాత్ర పోలీసుల నిఘా నీడన సాగింది. పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ పర్యవేక్షణలో ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 850 మందికి పైగా ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, ఏర్ సిబ్బంది స్పెషల్‌పార్టీతో కలిపి మొత్తం 950 బందోబస్తు విధులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రధాన పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షించింది.
నల్లగొండ సమీపంలో వల్లభరావు చెరువులో గణపయ్య నిమజ్జనం
వినాయక నిమజ్జనంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట
ఫ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడి మధ్య వాగ్వావాదం
రామగిరి(నల్లగొండ): గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పాతబస్తీ హనుమాన్ ఒకటవ నెంబర్ వినాయకుడి వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ జరిగింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్లగొండ నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అడ్డుకున్నారు. దేవుడి వద్ద జరుగుతున్న సమావేశంలో రాజకీయ ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వర్షిత్‌రెడ్డి అడ్డుకుని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. మంత్రి కోమటిరెడ్డి అంతటితో ప్రసంగాన్ని ముగించేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని విడుదల చేయాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చివరకు వర్షిత్‌రెడ్డి విడుదల చేయడంతో నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది.
జిల్లా వ్యాప్తంగా 5,984 విగ్రహాలను ప్రతిష్టించగా.. సుమారు 4 వేల విగ్రహాల నిమజ్జనం శుక్రవారం పూర్తయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలు రాయి, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ, కొండబీమనపల్లి, డిండి వద్ద పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

గంగ ఒడికి గణపయ్య

గంగ ఒడికి గణపయ్య

గంగ ఒడికి గణపయ్య

గంగ ఒడికి గణపయ్య

గంగ ఒడికి గణపయ్య