
మెరిసేదంతా బంగారం కాదు!
ప్రభుత్వానికి పన్ను ఎగవేత..
మిర్యాలగూడ : కల్తీ బంగారం అమ్మకాలకు మిర్యాలగూడ కేంద్రంగా మారింది. వంద గ్రాముల బిస్కెట్ బంగారంలో ఇరిడియం రెండున్నర గ్రాములు కలిపి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగారాన్ని వస్తు రూపంలో తయారు చేసేందుకు కరగదీసే క్రమంలో ఇరిడియం వైబ్రేట్ కావడంతో దుకాణాదారులకు నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రతి వంద గ్రాములకు సుమారు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు నష్టం వస్తున్నట్లు వాపోతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ రోజుకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు కల్తీ వ్యాపారం దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మిర్యాలగూడలో యంత్రం ద్వారా బిస్కెట్‌ను తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతనెల 23న స్వర్ణకారులు, రిటైల్ బంగారు వ్యాపారులు కల్తీ బంగారాన్ని ఎవరూ కొనరాదని, కల్తీ బంగారం అమ్మితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని తీర్మానం చేసుకున్నారు.
అక్రమంగా బంగారం రవాణా..
దొంగ బంగారాన్ని మిర్యాలగూడకు ప్రధాన కేంద్రాలైన కేరళ, తమిళనాడు, నెల్లూరు ప్రాంతాల నుంచి కిలోల కొద్దీ తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా మహిళలతో సరఫరా చేయిస్తున్నారని, లేదా ప్రత్యేకంగా గుమస్తాలను నియమించుకుని వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారని సమాచారం. వీళ్లు ప్రధానంగా రైళ్లు, బస్సులు, కొన్ని సందర్భాల్లో స్కూటీలపై కూడా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారం తీసుకుని బయలుదేరితే ఎక్కడ దిగాలో తామే మధ్యలో చెప్తామని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా విద్యార్థుల స్కూల్ బ్యాగులు, మహిళలైతే హ్యాండ్‌బ్యాగ్‌లను సిద్ధం చేసి వారికి ఫోన్‌లు ఇచ్చి పంపుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కేరళ నుంచి రైలులో బంగారం తీసుకొస్తుండగా నల్లగొండ రైల్వే పోలీసులు రూ.కోటిన్నర విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం వ్యాపారం పూర్తిగా హవాలా ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ మిర్యాలగూడలో కల్తీ బంగారం దందా
ఫ హోల్‌సేల్ వ్యాపారులు.. ఇరిడియం కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు
ఫ రోజూ రూ.కోట్లలో కల్తీ వ్యాపారం
ఫ నష్టపోతున్న వినియోగదారులు
మిర్యాలగూడకు ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి ట్యాక్స్‌లు చెల్లించకుండా బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చి వ్యాపారులకు, హోల్‌సేల్‌దారులకు మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్ముతున్నారు. ఉదాహరణకు ఆన్‌లైన్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.1.02లక్షలు ఉంటే బ్లాక్ మార్కెట్‌లో రూ.98,500కే విక్రయిస్తుంటారు. దీనికి జీఎస్టీ, సేల్ ట్యాక్స్, సంబంధిత టాక్స్‌లను రూ.కోట్లలో ఎగవేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన సేల్స్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఆర్‌ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ నకిలీ బంగారంపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెరిసేదంతా బంగారం కాదు!