
మళ్లీ రెవెన్యూ శాఖలోకి..
సీసీఎల్‌ఏ నిబంధనల ప్రకారం జీపీఓలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ పోసింగ్‌లు పొందిన వారంతా విధుల్లో చేరాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పోస్టింగ్ ప్రాంతాలను కేటాయిస్తున్నందున పైరవీలు చేయవద్దన్నారు. అనంతరం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ పొందిన వారికి ఉత్తర్వులను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ : వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామపాలనాధికారులుగా (జీపీఓ) కొత్తగా నియమించింది. పరీక్షల్లో ఎంపికై న వారికి శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాచించారు.
275 క్లస్టర్లు.. 276 మంది ఎంపిక
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో వీఆర్‌ఓలను, ఆగస్టు 2023లో వీఆర్‌ఏల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఆ సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులను తిరిగి తీసుకొస్తామని చెప్పింది. ఇతర శాఖల్లో ఉన్న పూర్త వీఆర్‌ఓ, వీఆర్‌ఏల్లో జీపీఓగా పని చేయాలనుకునే వారి నుంచి రెండు విడతలుగా దరఖాస్తులు తీసుకుంది. వారికి పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీఓలుగా ఎంపిక చేసింది.
కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు..
276 మంది జీపీఓలకు శనివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కౌన్సిలింగ్ ద్వారా క్లస్టర్లను కేటాయించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో పాసైన వారికి స్టేట్ ర్యాంకు కేటాయించారు. ఆ ర్యాంకు ప్రకారం మొదట కౌన్సిలింగ్‌లో వారికే అవకాశం కల్పించారు. రెండోసారి పరీక్ష రాసి పాసైన వారికి రెండో విడత కౌన్సిలింగ్‌లో అవకాశం కల్పించారు. జిల్లాలోని 275 రెవెన్యూ క్లస్టర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితాను వారికి ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. పీహెచ్‌సీ, విడో, మెడికల్ గ్రౌండ్స్‌తో పాటు స్పౌజ్ ఉన్న వారికి ప్రత్యేక కేటగిరిలో పోస్టింగ్ ఇచ్చారు. వారికి సొంత మండలం గాకుండా పక్కన మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. మిగతా వారికి సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వలేదు. మొత్తం 276 మంది ఎంపిక కాగా.. ఐదుగురు కౌన్సిలింగ్‌లో పోస్టింగ్ తీసుకోలేదు. వారు ప్రస్తుతం పని చేస్తున్న శాఖలోనే వెళ్తామని పేర్కొన్నారు. ఆ అంశం సీసీఎల్‌ఏ పరిధిలో ఉందని.. రిటర్న్ వెళ్లాలంటే సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలింగ్ అధికారులు సూచించారు.
జీపీఓలుగా 276 మంది పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏల నియామకం
ఫ కౌన్సిలింగ్ ద్వారా క్లస్టర్ల కేటాయింపు
ఫ సోమవారం విధుల్లో
చేరాలని ఆదేశాలు