
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి
రామగిరి(నల్లగొండ) : చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. శనివారం అయన నల్లగొండ సమీపంలోని పానగల్ చారుమతి చైల్డ్‌కేర్ సెంటర్‌ను ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం ఘర్షణలతో కూడుకొని ఉంటుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివితేనే ముందుకు వెళ్తారని పేర్కొన్నారు. గొప్పవారు కావాలనే పట్టుదల, సంకల్పంతో చదువుకోవాలని.. ఎవరి భవిష్యత్ వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. దాతల సహకారంతో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్‌ను నడిపిస్తున్న నాగసేనారెడ్డిని అభినందించారు. ఈ కేంద్రం ద్వారా 500 మందిని చదివించడం, 43 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా చైల్డ్‌కేర్ సెంటర్‌లో పని చేస్తున్న వారిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కృష్ణ, కృష్ణవేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కట్ట వెంకటరెడ్డి, వెంకన్న, గణేష్, నిర్మల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్