
ఉమ్మడి జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధికి అనుమతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ (హామ్) పథకం కింద 60 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పనులను రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్లగొండ– 1 పరిధిలో 223.12 కిలోమీటర్ల పొడవున 18 రోడ్లను రూ.302.45 కోట్లతో విస్తరణ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. అలాగే నల్లగొండ–2 పరిధిలో 314.66 కిలోమీటర్ల పొడవున రూ.320.80 కోట్లతో 26 రోడ్లను అభివృద్ధి విస్తరణ పనులను చేపట్టనుంది. యదాద్రి భువనగిరి జిల్లాలో 287.50 కిలోమీటర్ల పొడవున రూ.389.73 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రామగిరి(నల్లగొండ): ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతోపాటు ముప్పై కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, తొమ్మిది రకాల డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 15 సెప్టెంబర్ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు www. oucde.net వెబ్‌సైట్‌తోపాటు సెల్ : 9398673736, 9866977741 నంబర్లను కా ర్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
జనగామ జిల్లాకు నల్లగొండ ఇసుక
నల్లగొండ : జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జిల్లా నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇచ్చేందుకు నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. ఇసుక లేని జిల్లాలకు ఇసుక రీచ్‌లు ఉన్న జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే శాలిగౌరారం మండలం వంగమర్తి, చిత్తలూరు ఇసుక రీచ్‌లలో కొత్తగా గుర్తించిన ప్రదేశం నుంచి 27 హెక్టార్లలో ఇసుక తీసేందుకు రాష్ట్ర టీజీఎండీసీకి ప్రతిపాదనలు పంపేందుకు తీర్మానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకుడు శామ్యూల్ జాకబ్ పాల్గొన్నారు.
గరిష్ట నీటిమట్టానికి చేరువగా ‘మూసీ’
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమం పెరుగుతూ గరిష్ట స్థాయికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,799 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం (4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టు బుధవారం సాయంత్రం నాటికి 643 (3.91 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. కుడి కాల్వకు 262 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 307 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ రూపంలో 70 క్యూసెక్కుల నీరు వృథా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు అవసరం
నల్లగొండ : చిన్నారుల సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు ఎంతో అవసరమని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం నల్లగొండలోని డైట్‌లో నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణలో ఆయన మాట్లాడారు. పిల్లలు వివిధ పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకోవాన్నారు. కార్యక్రమంలో ఆర్పీ నర్సింహమూర్తి, సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య పాల్గొన్నారు.