
ముసురుతో పత్తి చేలకు జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ముసురుతో కూడిన చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 54.4మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా దేవరకొండ మండలంలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం వరకు జిల్లాలో సరైన వర్షాలు లేక పత్తి చేలు వాడుబట్టాయి. ఈక్రమంలో ఐదు రోజుల క్రితం కురిసిన వర్షం పత్తి చేలకు జీవం పోసింది. అదే అదునులో రైతులు పత్తి చేలకు ఎరువు చల్లుతూ.. కలుపు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి ముసురు పట్టడంతో పత్తిచేలు మరింత నిగనిగలాడుతున్నాయి. ముసురు తగ్గితే రైతులు ఎరువులు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎరువు పెట్టుకున్న రైతులు కలుపులు తీసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 6,40,567 ఎకరాల్లో పత్తి సాగుకానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 5,02,641 ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు.
ఫ రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు
ఫ ఏపుగా పెరుగుతున్న చేలు
ఫ ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న రైతులు
ఫ జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా పత్తిసాగు
ఎరువు పెట్టుకున్నాం
ఐదు రోజుల క్రితం కురిసిన వర్షానికి పత్తి చేనుకు ఎరువు పెట్టుకున్నాం. ఇప్పుడు రెండు రోజుల నుంచి అదునైన వర్షం కురుస్తుండంతో పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. ముసురుతో కూడిన వర్షం వల్ల పత్తిచేలకు ఎంతో మేలు జరుగుతుంది.
– జానపాటి రాజేంద్రప్రసాద్, రైతు, గుండ్లపల్లి
పంట అంచనా సాగువిస్తీర్ణం
(ఎకరాల్లో..)
పత్తి 6,40,567 5,02,641
వరి 5,25,350 65,284
జొన్న 500 55
కంది 10,000 1,545
పెసర 1,200 166
వర్షం తగ్గితే ఎరువులు పెట్టుకోవచ్చు
ప్రస్తుతం కురుస్తున్న ముసురుతో కూడిన వర్షంతో మెట్టపంటలకు చాలా ప్రయోజకరంగా ఉంది. వర్షం తగ్గిన వెంటనే పత్తి చేలకు ఎరువులు పెట్టుకోవడానికి అనుకూలంగాా ఉంటుంది. ఇప్పటికే ఎరువులు పెట్టిన చేలు ఏపుగా పెరుగుతాయి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి

ముసురుతో పత్తి చేలకు జీవం

ముసురుతో పత్తి చేలకు జీవం