
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు. ఈ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని వాహనాలు నెమ్మదిగా నడపాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, శిథిల భవనాల కింద ఉండొద్దని పేర్కొన్నారు. రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోవద్దని తెలిపారు. వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు ఈతతోపాటు చేపలు పట్టడానికి వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఆపదలో ఉంటే డయల్ 100కి కాల్ చేయాలని కోరారు.
ఎంఆర్‌పీకే ఎరువులను విక్రయించాలి
కట్టంగూర్ : రైతులకు ఎంఆర్‌పీకే ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పి.శ్రవణ్‌కుమార్ దుకాణాదారులకు సూచించారు. గురువారం కట్టంగూర్‌లోని ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రశీదు బుక్‌లను, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించి పీఓఎస్ మిషన్ ఆన్‌లైన్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ గిరిప్రసాద్, ఏఈఓలు ఉన్నారు.
రేపు కార్గిల్ విజయ్ దివస్
నల్లగొండ: ఈ నెల 26న ఉదయం 11 గంటలకు నల్లగొండలోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించనున్నట్లు ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, జనరల్ సెక్రటరీ కె.వెంకటాచారి, ట్రెజరర్ కె.భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వీరజవాన్లకు నివాళులర్పించిన అనంతరం మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమర జవాన్ల కుటుంబ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఏటీసీ, ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు
నల్లగొండ: నల్లగొండలోని ప్రభుత్వ బాలికల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ), ఐటీఐ కోర్సుల్లో 2025–26, 2027 సంవత్సరాలకు గాను ప్రవేశాల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జంజిరాల వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఫెయిల్ అయిన విద్యార్థులు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో వారి ఫోన్ నంబర్లతో ఈ నెల 31లోగా రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలని కోరారు.
పశువ్యాధులతో జాగ్రత్త
మాడుగులపల్లి: సీజనల్‌గా పశువులకు సోకే వ్యాధులతో పశువైద్యులు జాగ్రత్తంగా ఉంటూ రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్ అన్నారు. గురువారం మాడుగులపల్లి మండలం పాములపాడు, మాడుగులపల్లి పశువైద్యశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే రైతులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పాడి రైతులు.. పశువైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి వినయ్‌కుమార్, విక్రమ్, శ్రీలత, నవీన్, మహబూబ్‌అలీ, జయమ్మ ఉన్నారు.