
గ్రామం యూనిట్‌గా ఓటరు జాబితా
ఫ రూపకల్పనకు ఉన్నతాధికారుల ఆదేశాలు
ఫ ఇప్పటికే మండలం యూనిట్‌గా పూర్తి
ఫ ఎంపీడీఓల లాగిన్ నుంచి టీ పోల్‌లో అప్‌లోడ్
ఫ సిద్ధమవుతున్న పంచాయతీ అధికారులు
కుటుంబ సభ్యుల ఓట్లన్నీ
ఒకే వార్డులో ఉండేలా..
కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఉంటే ఒకరి ఓటు ఒక వార్డులో, ఇంకొకరి ఓటు మరో వార్డులో ఉన్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈసారి గ్రామం యూనిట్‌గా ఓటరు జాబితా తయారీకి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
నల్లగొండ: గ్రామం యూనిట్‌గా మళ్లీ ఓటరు జాబితా తయారు కానుంది. ఇప్పటికే మండలం యూనిట్‌గా అధికారులు ఓటరు జాబితా తయారు చేశారు. తాజాగా ఉన్నతస్థాయి అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీకి పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల జాబితా ప్రకారం జిల్లాలో 10,53,920 మంది ఓటర్లు ఉన్నారు.
ఇప్పటికే మండలం యూనిట్‌గా..
ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలతో అప్పట్లో ఎన్నికల కమిషన్ సూచనలతో పంచాయతీరాజ్ శాఖ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఓటరు జాబితాను సిద్ధ చేసింది. ఆయా గ్రామాల్లో వార్డుల వారీగా జాబితా తయారు చేసి మండలాల వారీగా ఎంపీడీఓలకు అందించారు. ఎంపీడీఓలు వారి లాగిన్ నుంచి టీ పోల్‌లో అప్‌లోడ్ చేసి పెట్టారు. అయితే గతంలో 2023లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా జాబితాను సిద్ధం చేశారు.
ఇప్పుడు వార్డుల వారీగా..
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఓటరు జాబితా తయారు చేయాలని ప్రస్తుతం పంచాయతీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి..వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదంతా గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్వహించాలి. ఓటరు జాబితా సిద్ధమైన తర్వాత దాన్ని వారి లాగిన్ ద్వారా టీ పోల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎంపీడీఓలు దాన్ని పరిశీలించి డీపీఓకు పంపుతారు.
మార్పులు, చేర్పులకూ అవకాశం
జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పార్లమెంట్ ఎన్నికల జాబితా ప్రకారం 10.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే కొత్తగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారితోపాటు మరికొందరు చనిపోయిన వారున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు కూడా ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. వీటన్నింటి ఆధారంగా గ్రామం యూనిట్‌గా మళ్లీ ఓటరు జాబితా సిద్ధం చేయనున్నారు.
పంచాయతీలు 869
వార్డుల సంఖ్య 7,494
ఓటర్లు 10,53,920
ఆదేశాలు వచ్చాయి
గ్రామం యూనిట్‌గా ఓటరు జాబితాను తయారు చేయాలని పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాను తయారు చేస్తాం. పంచాయతీల సిబ్బంది అంతా తప్పులకు ఆస్కారం లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలి. మరో రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తాం.
– వెంకయ్య, జిల్లా పంచాయతీ అధికారి
ఈ జాబితాతోనే ‘పరిషత్’ పోరుకు..
ప్రస్తుతం గ్రామం యూనిట్‌గా తయారు చేసే ఓటరు జాబితాతోనే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామాల్లో మొదటి వార్డు మొదలు చివరి వార్డు వరకు ఓటరు జాబితాలో తప్పులు పోకుండా రూపొందించనున్నారు.