ఆగని కబ్జాల పరంపర | - | Sakshi
Sakshi News home page

ఆగని కబ్జాల పరంపర

Jul 25 2025 8:05 AM | Updated on Jul 25 2025 8:05 AM

ఆగని కబ్జాల పరంపర

ఆగని కబ్జాల పరంపర

ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

పట్టణంలోని తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసేటప్పుడు మిగిలిన కొంత ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించుకుని అమ్ముకున్నారు. ప్రభుత్వం సర్వే చేసి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి.

– బంటు లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్‌, తాళ్లగడ్డ

హెచ్చరించి వదిలేశాం..

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తాళ్లగడ్డలో ప్రభుత్వ భూముల్లో చదును చేస్తున్న సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాం. జేసీబీని స్వాధీనం చేసుకున్నాం. మరోసారి ప్రభుత్వ భూముల జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో హెచ్చరించి వదిలేశాం. లేఅవుట్‌ వేసిన తరువాత మిగిలిన ఖాళీ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపైనే ఉంటుంది.

– సురేష్‌కుమార్‌, తహసీల్దార్‌, మిర్యాలగూడ

మిర్యాలగూడలో ప్రభుత్వ భూముల ఆక్రమణ

చెరువులు, నాలాలకు ఆనుకుని ఖాళీ స్థలం ఉంటే ఖతమే..

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మకాలు

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాల పరంపర కొనసాగుతోంది. పట్టణ శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులు, నాలాలకు ఆనుకుని ఉన్న భూములను కొందరు ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పందిర్లపల్లి చెరువుశిఖం భూములను చదును చేసి కబ్జా చేస్తున్న విషయం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు పెద్దచెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారు.

రూ.కోటిన్నర విలువ చేసే భూములు మాయం

తాళ్లగడ్డ చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటికి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించి రూ.లక్షలకు విక్రయించుకున్నారు. ఇందిరమ్మ కాలనీకి లేఅవుట్‌ చేసే సమయంలో క్రాస్‌ బిట్లు, స్థలాలు ఖాళీగా ఉండడంతో వాటికి పక్కన ఉన్న ఇంటి నంబర్‌కు బై నంబర్‌ వేసి పట్టా సర్టిఫికెట్లను సృష్టించి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు విక్రయించారు. ఇలా సుమారు రూ.కోటిన్నర విలువ చేసే ప్రభుత్వ భూములు మాయమాయ్యాయి. అదేవిధంగా సర్వే నంబర్‌ 57, 58, 59లో 5, 6,7 ఇందిరమ్మ లేఅవుట్లలో సుమారు 22 ప్లాట్లను అనధికారికంగా విక్రయించుకున్నారు. తాళ్లగడ్డ నుంచి తడకమళ్లకు వెళ్లే ప్రధాన రహదారికి కుడి వైపున కాల్వను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఓ రాజకీయ నాయకుడు మంగళవారం జేసీబీలతో చదును చేస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు.

ఉన్నతాధికారి ఉన్నా..

మిర్యాలగూడ డివిజన్‌ను ప్రభుత్వం గుర్తించి ఐఏఎస్‌ స్థాయి అధికారిని సబ్‌ కలెక్టర్‌గా నియమించింది. ఉన్నతస్థాయి అధికారి ఉన్నప్పటికీ పట్టణ శివారులోని ప్రభుత్వ భూముల కబ్జాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కళ్లెదుటే భూములను కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement