
మహాలక్ష్మి పథకం.. మహిళలకు వరం
రామగిరి(నల్లగొండ): మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు వరంలాంటిదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం మైలురాయి దాటిన సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెట్రో రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్లే ఢిల్లీలో తాను డిగ్రీ పూర్తిచేయగలిగానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది మహిళలకు చదువు, ఉద్యోగం, వ్యాపారపరంగా మేలు జరుగుతందన్నారు. ఉచిత బస్సుల్లో ఎక్కువమంది మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ఉంటే బాగుంటుందన్నారు. ఇందుకు కృషిచేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత, నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన మధుశ్రీ, దీక్షిత, కరుణప్రియ, శ్రీలక్ష్మి, ఎస్‌కే ఆఫ్రిన్లకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అలాగే రెగ్యులర్‌గా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళా ప్రయాణికులు మాధవి, జ్యోతి, గీత, ఉష, అనసూయను జ్ఞాపికలతో సన్మానించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి