
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
ఫ విత్తే సమయమొచ్చే..
నల్లగొండ : ధాన్యం సేకరణ, వ్యవసాయ సీజన్ సంసిద్ధత, భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాపాలన మాదిరిగానే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన 10 శాతం ధాన్యం సేకరించాలని సూచించారు. ఎంత ఎరువులు, విత్తనాలు కావాలో ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎవరైనా ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి జాబితా తయారుచేసి వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పక్కగా అమలు చేయాలని, మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదన కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.