
మొక్కలను మింగేశారు..!
ఫ అవెన్యూ ప్లాంటేషన్ పేరిట
నిధులు స్వాహా
ఫ పనులు చేయకుండానే బిల్లులు డ్రా
ఫ సోషల్ మీడియాలో మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ పోస్టు వైరల్
మిర్యాలగూడ: మున్సిపాలిటీలకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులను పనులను చేయకుండానే అధికారులు స్వాహా చేస్తున్నారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతున్నా మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయలు కాజేసినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ అవినీతి అంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇద్దరు అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రూ.70లక్షల నిధులు మంజూరు..
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై 2023లో అవెన్యూ ప్లాంటేషన్ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బడ్జెట్ కింద మిర్యాలగూడ మున్సిపాలిటీకి నందిపాడు బైపాస్ (2.33 కి.మీ) నుంచి ఖలీల్ దాబా (4.66 కి.మీ) వరకు ఇన్నర్, ఔటర్‌లో అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.70,14,616.60 నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను చేసేందుకు 5 సెప్టెంబర్ 2023న టెండర్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 14న టెండర్ల గడువు ముగియడంతో అదేరోజు సాయంత్రం టెండర్లను ఓపెన్ చేశారు. ఈ పనులు 90 రోజుల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మొక్కలను నాటలేదు. దీంతో అప్పటి అధికారులు బిల్లులు చేయలేదు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. అప్పుడున్న మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, ఏఈ బదిలీ అయ్యారు.
హడావిడిగా చెక్కు జారీ
మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ నుంచి ఖలీల్ దాబా వరకు రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను నాటాల్సి ఉంది. అప్పటికే బైపాస్ వెంట కోనోకార్పస్, గన్నేరు మొక్కలు నాటి ఉన్నాయి. ఎక్కువ క్వాలిటీ ఉన్న మొక్కలను నాటాలని రూ.70 లక్షల నిధులు మంజూరు చేయగా మొక్కలను నాటకుండానే మున్సిపల్ అధికారులు ఇటీవల బిల్లులు నమోదు చేసి చెక్కు జారీ చేశారు. హడావుడిగా కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, ఏఈలు బిల్లులు చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మొక్కలను నాటకుండానే నాటినట్లు అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు.
మున్సిపాలిటీలో అవినీతిపై జోరుగా చర్చ
అవెన్యూ ప్లాంటేషన్‌లో జరిగిన అవినీతిపై మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళవారం మన మిర్యాలగూడ ఫేస్‌బుక్ పేజీలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యమా? అని పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. బైపాస్‌రోడ్డు వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారని, దానికి సంబంధించిన టెండర్, నోటిఫికేషన్ పోస్టు చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మొక్కలను నాటకుండానే నాటినట్లు మున్సిపల్ అధికారులు బిల్లులు రాసి రికార్డు చేసి చెక్కు జారీ చేశారని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలని కోరడంతో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై జోరుగా చర్చ సాగుతోంది. కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ యూసుఫ్‌ను, డీఈ వెంకన్నను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.