మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

May 28 2025 5:43 PM | Updated on May 28 2025 5:43 PM

మున్స

మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

నివేదిక సిద్ధం చేస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్‌ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభిస్తాం. మున్సిపాలిటీల్లోని అన్ని విభాగాల ఉద్యోగులు 100 రోజుల్లో చేయాల్సిన పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తారు. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌కు సంబంధించి అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నాం.

–సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, నీలగిరి మున్సిపల్‌ కమిషనర్‌

జూన్‌ 2 నుంచి ప్రారంభం

అభివృద్ధి పనుల పూర్తి,

రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు లక్ష్యం

ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు

నల్లగొండ టూటౌన్‌: మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని విభాగాలు 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.

మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల

ఆధ్వర్యంలో..

మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులతో కలిసి జూన్‌ 2వ తేదీన పెద్ద ఎత్తున 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించడం, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, ఎక్కడ పంపిణీ చేయాలి, ఎక్కడ నాటాలి అనే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను తప్పుఒప్పులను సవరించడం లాంటి కార్యక్రమం 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు.

ఈ నెలాఖరులోగా 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుని జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు మున్సిపాలిటీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలాంటివి చేపట్టాలి. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ల ఏర్పాటు, దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు..

ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు పూర్తి చేయడంతోపాటు వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, క్రమబద్ధీకరించడం, లేదా తొలగించడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్‌ అధికారులు ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు వైద్యశిబిరాలు చేపట్టాలి. పార్కుల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 100 రోజుల్లో ఏ విభాగం ఎంతమేర పనితీరు మెరుగుపర్చారో నివేదిక అందజేయాల్సి ఉంటుంది. వార్డులకు నోడల్‌ ఆఫీసర్ల నియామకం చేపట్టి నిరంతరం పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయా మున్సిపాలిటీలు తేదీల వారీగా జాబితా రూపొందించే పనిల్లో పడ్డాయి.

మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌1
1/1

మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement