
దేవరకొండలో రోడ్ షోకు హాజరైన జనం
ఫ కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి
ఫ కాంగ్రెస్ హయాంలో ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి
ఫ మేమొచ్చాక నిధులు కేటాయించి మరమ్మతు చేయించాం
ఫ కొత్త లిఫ్టులు మంజూరు చేశాం.. పనులు కొనసాగుతున్నాయి
ఫ ఫ్లోరోసిస్ నుంచి ప్రజలను కాపాడిన ఘనత మాదే..
ఫ హుజూర్‌నగర్, దేవరకొండ రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్
హుజూర్‌నగర్, దేవరకొండ : గతంతో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేశామని, ఇవి కొనసాగాలంటే ప్రజలు మరోమారు కారు గుర్తుకు ఓటేసి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హుజూర్‌నగర్‌లో అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, దేవరకొండలో అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ గెలుపును కోరుతూ నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నో లిఫ్టులు ఉన్నాయని వాటిని రిపేర్ చేయించలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి సైదిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రూ.1,770కోట్లతో ముక్త్యాల, జాన్‌పహాడ్ లిఫ్టుల పనులు ప్రారంభమయ్యాయని, రూ.340 కోట్లతో ఎన్నెస్పీ కాల్వల సీసీ లైనింగ్ చేస్తున్నారని చెప్పారు. ‘మా తమ్ముడు సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఫుల్‌టర్మ్ పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో గెలిచిండు మీరు నాలుగేళ్లు అవకాశం ఇచ్చారు. అందులో రెండేళ్లు కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలుసు’ అని అన్నారు. 2004 నుంచి 2014 దాకా ఉత్తమ్ చేయలేని పని రెండేళ్లలో సైదిరెడ్డి చేశాడని చెప్పారు. హుజూర్‌నగర్‌కు ఆర్‌డీఓ కార్యాలయం, ఈఎస్‌ఐ హాస్పిటల్ మంజూరు చేసినట్లు తెలిపారు. మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో ఇండస్ట్రియల్ పార్కు కావాలని అడుగుతున్నారని అవన్నీ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. వర్షంలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం చూస్తుంటే.. సైదిరెడ్డి గెలిచి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు.
కారు గెలుపును ఎవరూ ఆపలేరు
కారు గెలుపును ఎవరూ ఆపలేరని హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్ల నియోజకవర్గాన్ని నాలుగేళ్లలో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. ఎప్పుడూ జనం మధ్య ఉండే సైదన్న కావాలా, చుట్టపుచూపుగా వచ్చిపోయే నాయకుడు కావాల్నో ప్రజలు ఆలోచించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని , వర్షం పడ్డా , పిడుగులు పడ్డా అవి ఆగవన్నారు. ఎన్నికల్లో రకరకాల గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రశాంతంగా ఉండి ఓటు వేయించాలని అన్నారు. రోడ్‌షోలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు కాసోజు శంకరమ్మ, బాణోతు రమణా నాయక్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీలు పార్వతి, వెంకట్‌రెడ్డి, నాయకులు హరిబాబు, అమర్‌నాఽథ్ రెడ్డి, అమర్, నగేష్ రాథోడ్, కోట సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.
