‘యాప్’తో సకాలంలో ఎరువులు
ఆర్థిక హక్కులపై
అవగాహన ఉండాలి
నల్లగొండ : ఆర్థిక హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో శనివారం అన్ క్లెయిమ్డ్ ఖాతాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, షేర్లపై వచ్చే డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్‌లపై సరైన సమాచారం లేక క్లెయిమ్ చేయకుండా మిగిలిపోతున్నాయన్నారు. కొందరు ఖాతాదారులు చిరునామా, ఫోన్ నంబర్ మార్పు, నామినేషన్ లేకపోవడం, కేవైసీ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో తమ సొంత డబ్బును పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఖాతాదారులు తన బ్యాంకు ఖాతా వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మీ డబ్బు మీరు సొంతం చేసుకోవాలని, దీనిపై బ్యాంక్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒక ఖాతాదారునికి సంబంధించి రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ మేనేజర్ మైత్రిని అభినందించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ జీఎం ఎంజీ.సుప్రభాత్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, హౌసింగ్ ిపీడీ రాజ్‌కుమార్, ఎస్‌బీఐ ఆర్‌ఎం శివకృష్ణ, టిజిబి ఆర్‌ఎం విజయ్‌కుమార్, నాబార్డు పీఎం వినయ్, ఎల్‌డీఎం శ్రామిక్ పాల్గొన్నారు.
నల్లగొండ టౌన్ : రైతులకు సకాలంలో అవసరమైన యూరియా, ఎరువులను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఫర్టిలైజర్స్ యూరియా ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం నల్లగొండలోని మన గ్రోమోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకుని, నేరుగా సమీప డీలర్ వద్ద పొందవచ్చన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలు, దళారుల బెడద తగ్గుతుందని చెప్పారు. ఈ యాప్ వినియోగంపై అధికారులు, డీలర్లు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ జూకూరు రమేష్, ఏఓ శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డీలర్లు నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి


