ప్రజావాణి యథాతథం
నల్లగొండ : కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీనుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు వారి ఫిర్యాదులు అందజేయడానికి ఈ నెల 22న జరిగే ప్రజావాణికి హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
నేడు జాతీయ
లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, ప్రీ లిటీగేషన్ కేసుల పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదల
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలను ఎంజీ యూనివర్సిటీ సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్‌తో కలిసి శనివారం విడుదల చేశారు. 2025 నవంబర్‌లో డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడవ సెమిస్టర్ 31శాతం, ఐదవ సెమిస్టర్ 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, అంతటి శ్రీనివాసులు, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, జే.నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు తదితరులు పాల్గొన్నారు.
నేడు కాంగ్రెస్ నిరసన ర్యాలీ
నల్లగొండ : జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జి రామ్‌జి పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఈ నెల 21న నల్లగొండలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ నుంచి ర్యాలీ ప్రారంభించి రామగిరి గాంధీ విగ్రహం వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
23న కేటీఆర్ రాక
నల్లగొండ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 23న నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను నల్లగొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సన్మానించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించారు.
కార్యదర్శులకు బిల్లులు ఇప్పించాలి
నల్లగొండ : పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతున్నందున ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు పెట్టిన బిల్లులు ఇప్పించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో డీపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని తెలిపారు. కొత్తగా సర్పంచ్‌లు వచ్చారని.. ఇప్పుడు విడుదలయ్యే 15 ఫైనాన్స్ నిధుల నుంచి మొదటగా పంచాయతీ కార్యదర్శులు ఖర్చుపెట్టిన బిల్లులకు చెక్కులు జారీ చేసేలా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు.
ప్రజావాణి యథాతథం


