ముగిసిన ఎన్‌పీఎల్ టోర్నమెంట్
నల్లగొండ : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున సహకరిస్తామన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులను ఆదుకుంటామన్నారు. టోర్నమెంట్ విజేత డీకే వారియర్స్ జట్టుకు ప్రథమ బహుమతిగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీల్డ్, రూ.2,22,222 నగదు, రన్నరప్‌గా నిలిచిన ఆదా సిసి జట్టుకు నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున షీల్డ్, రూ. 1,11,111 బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, పాశం సంపత్‌రెడ్డి, ప్రదీప్‌నాయక్, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, రంగా, పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


