గోల్డెన్ అవర్‌లో వైద్యం!
జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్ ప్రాంతీయ ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుతో రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందనుంది. ట్రామాకేర్ సెంటర్ పనులు త్వరలో ప్రారంభిస్తాం. దేవరకొండ ఆస్పత్రిలో అదనంగా మరో ఐదు డయాలసిస్ బెడ్లు సైతం ఏర్పాటు కానున్నాయి.
– మాతృనాయక్, డీసీహెచ్‌ఎస్, నల్లగొండ
దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి వెంటనే చికిత్స అందించేలా ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో కొత్తగా నాలుగు ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ట్రామాకేర్ సెంటర్ ద్వారా క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో మెరుగైన, తక్షణ చికిత్స అందడంతో ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మొదట దేవరకొండ, మిర్యాలగూడలో..
జిల్లాలో నాలుగు ప్రాంతీయ ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుండగా మొదటి విడతలో దేవరకొండ, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రుల్లో పనులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగార్జునసాగర్, నకిరేకల్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఆస్పత్రులకు ఇప్పటికే రోజూ వందల సంఖ్యలో ఓపీ నమోదు అవుతుండగా.. వీటిలో రోడ్డు ప్రమాదాల కేసులు కూడా ఉంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను అత్యవసర సమయాల్లో హైదరాబాద్, నల్లగొండలోని ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోంది. ఏరియా ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటైతే ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందనుంది.
సమకూరనున్న సౌకర్యాలు..
ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటైతే ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే విభాగం, ఆల్ట్రాసౌండ్, ప్రత్యేక బ్లడ్‌బ్యాంక్, 5 ఐసీయూ బెడ్స్, మరో 5 స్టెప్‌డౌన్ బెడ్స్ అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌గా పిలిచే మొదటి గంటలోగా ఆస్పత్రికి తీసుకొస్తే తక్షణ మెరుగైన వైద్య సహాయం అందనుంది.
ఫ జిల్లాకు నాలుగు ట్రామాకేర్
సెంటర్లు మంజూరు
ఫ దేవరకొండ, మిర్యాలగూడ,
సాగర్, నకిరేకల్‌లో ఏర్పాటు
ఫ క్షతగాత్రులకు అందనున్న తక్షణ చికిత్స
గోల్డెన్ అవర్‌లో వైద్యం!


