నేటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
నల్లగొండ : జిల్లాలోని గొర్రెలు, మేకలకు ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు సామూహికంగా నట్టల నివారణ మందు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్ జీవీ రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 250 మంది సిబ్బంది 78 మంది బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జీవాల పెంపకందార్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్ అలీ అన్నారు. ఫిట్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే ఫిట్‌నెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాల నుంచి ఆర్టీసీ కాలనీ మీదుగా రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులచే సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వివిధ క్రీడల్లో పాల్గొనడంతోపాటు వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ వరప్రసాద్, ప్రిన్సిపాల్ అంథోని, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులకు ఆదాయం
చిట్యాల : రైతులంతా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ నిరంతర ఆదాయం పొందాలని స్టేట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ కె.సురేంద్రమోహన్ పేర్కొన్నారు. చిట్యాల మున్సిపాలిటీ శివారులోని కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో కూరగాయల పంటలు, వ్యవసాయ పద్ధతులు, ఆదాయం, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ రైతులంతా సుస్థిర వ్యవసాయం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బాబునాయక్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్వేత, ఏఓ గిరిబాబు, రహీమ్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడికి పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రబాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు.
నేటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ


