భార్య కాపురానికి రావడం లేదని.. పురుగుల మందు తాగి.. | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని.. పురుగుల మందు తాగి..

Published Thu, Oct 19 2023 2:08 AM

- - Sakshi

నల్గొండ: భార్య కాపురానికి రావడం లేదని పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటిగానితండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటిగానితండాకు చెందిన సపావత్‌ చీన్య(35)కు 13ఏళ్ల క్రితం పోల్యనాయక్‌తండాకు చెందిన సునీతతో వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీత తన తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన చీన్య మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా బుధవారం మృతిచెందాడు.

జీవితంపై విరక్తితో..
జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బత్తుల భద్రయ్య(75) 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. జీవితం మీద విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బత్తుల సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్‌. ధర్మ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఉరేసుకొని ఆత్మహత్య
పెళ్లి కాలేదని జీవితంపై విరక్తితో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలంలోని లింగాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన తడకమళ్ల మధుకుమార్‌(53)కు పెళ్లి కాకపోవడంతో తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేకుకొని వివరాలు సేకరించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ లభించినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి లక్ష్మీనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం
ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జాహ్నవి టౌన్‌షిప్‌ వద్ద బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం సూర్యాపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
Advertisement