● జకినాలపల్లిలో
సబ్‌స్టేషన్ ముట్టడి.. వంటావార్పు
కల్వకుర్తి రూరల్: ఎడాపెడా విధిస్తున్న కరెంట్ కోతలపై అన్నదాతలు ఆక్రోశం వెల్లగక్కారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియని పరిస్థితుల్లో సరఫరా ఉండటంతో ఆదివారం ఊర్కొండ మండలంలోని జకినాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. జగినాలపల్లి, ఊర్కొండపేట రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి.. ప్రభుత్వానికి, విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము సాగు చేసిన వేరుశనగ పంటకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రూ.వేలు వెచ్చించి పంటలు సాగు చేశామని, ఇప్పుడు విద్యుత్ కోతలతో నీరు పారక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పశువులకు తాగునీరు సైతం అందే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామంటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించి కూర్చున్నారు. రైతులకు పోలీసులు, విద్యుత్ ఏఈ సలేశ్వరం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. బోరు, బావుల ద్వారా పంటలు పండిద్దామంటే కరెంట్ కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ ఆవేదన చేశారు. అక్కడే వంటావార్పు చేపట్టి భోజనాలు చేశారు. అనంతరం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్‌తో కూడిన వినతిపత్రాన్ని ఏఈ సలేశ్వరం గౌడ్‌కు అందజేశారు. కార్యక్రమంలో రైతులు రామాంజనేయులు, అంజయ్య, శ్రీధర్‌రెడ్డి, జంగయ్య, మల్లేష్, చంద్రయ్య, సురేందర్, సాయిరెడ్డి, యాదయ్య, బాలరాజు, జంగయ్య పాల్గొన్నారు.


