పదేళ్ల ప్రగతి పథం.. | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల ప్రగతి పథం..

Oct 11 2026 9:59 AM | Updated on Oct 11 2026 9:59 AM

అటవీ, పర్యాటక రంగాలకు అవకాశాలు..

కందనూలు: తెలంగాణ వచ్చాక నాగర్‌కర్నూల్‌కు మహర్ధశ పట్టింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2016 అక్టోబర్‌ 11న జిల్లాగా ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. కలెక్టర్‌, ఎస్పీ, అడిషనల్‌ కలెక్టర్లు, అన్నిశాఖల ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు పాలన మరింత చేరువైంది. అధికారిక నిర్ణయాల్లో జాప్యం తగ్గింది. ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుతో పరిపాలనా కార్యకలాపాలకు కొత్తరూపం వచ్చింది.

పాలనలో కొత్త పుంతలు..

జిల్లాలో మొత్తం 20 మండలాలు ఏర్పాటయ్యాయి. అలాగే రెవెన్యూ డివిజన్లుగా నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ కొనసాగుతున్నాయి. చిన్న చిన్న పల్లెలు, మారుమూల తండాలు గ్రామ పంచాయితీలుగా మారడంతో ఆయా గ్రామాల్లో స్వయం పాలనకు అడుగులు పడ్డాయి.

వ్యవసాయమే ప్రధాన ఆధారం..

జిల్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోంది. 2016లో జిల్లావ్యాప్తంగా 60వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేసేవారు. 2026లో లక్షా 80వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అలాగే పత్తి 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 95వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. పదేళ్ల కాలంలో పంటల సాగు రెండింతలు పెరిగింది.

రైతులకు సాగునీరు..

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 4.51 లక్షల ఎకరాలకు గాను 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పథకంతో అచ్చంపేట, ఉప్పునుంతల, తెలకపల్లి, లింగాల, బల్మూరు, కల్వకుర్తి మండలాల్లో సాగునీటి సమస్య తీరింది. అలాగే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12.30లక్షల ఎకరాలకు సాగునీరు, పల్లెలకు తాగునీరు అందనుంది.

మౌలిక వసతుల కల్పన..

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగు నీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులు మరింత మెరుగుపడ్డాయి. ప్రజలకు అందుబాటులోకి రవాణా సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సేవలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగింది.

నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం వంటి ప్రకృతి సంపద జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ.. పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను భవిష్యత్‌ తరాలకు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది.

కలెక్టరేట్‌

జిల్లా ఏర్పాటుతో

ప్రజలకు చేరువైన పాలన

అందుబాటులోకి మెరుగైన విద్య, వైద్యం

సాగునీటి ప్రాజెక్టులతో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నేడు జిల్లా ఆవిర్భావ దినోత్సవం

భవిష్యత్‌ లక్ష్యాలపై దృష్టిపెట్టాలి

జిల్లాగా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై సమీక్షించుకోవడంతో పాటు, భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది.

– రవికాంత్‌రావు, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌

మరింత అభివృద్ధి సాధించాలి

నాగర్‌కర్నూల్‌ జిల్లా మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జిల్లాస్థాయి పాలనతో పాటు విద్య, వైద్యం మెరుగుపర్చాలి. ఈ ప్రాంతంలో రైలుమార్గం అందుబాటులో లేకపోవడం, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు లేవు. పాలకులు శ్రద్ధ వహించి.. జిల్లాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.

– శ్రీధర్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌

అందుబాటులో మెరుగైన వైద్యం

జిల్లా ఏర్పాటు తర్వాత మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలతో పాటు డయాగ్నొస్టిక్‌ హబ్‌ ఏర్పాటైంది. ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా జనరల్‌ ఆస్పత్రి స్థాయికి అప్‌గ్రేడ్‌ అయింది. జిల్లాలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.

పదేళ్ల ప్రస్థానం.. ముందున్న లక్ష్యాలు

జిల్లా ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరిగినా.. అభివృద్ధి ఫలాలు జిల్లాలోని ప్రతి గ్రామానికి సమానంగా చేరాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత కీలకంగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement