మన్ననూర్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 14న నల్లమల ప్రాంతంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శనివారం మన్ననూర్‌లో 220/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ ఏర్పాట్లను ఆయన పరిశీలించిన అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను మన్ననూర్ పురుగుల గుట్ట వద్ద రూ. 69కోట్లతో చేపట్టే 220/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య తీరడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు. సమావేశంలో సర్పంచులు మంజుల రాజారాం, కోటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, ఉపసర్పంచ్ రమణగౌడ్, నాయకులు పంబలి బుచ్చయ్య, శ్రీనివాసులు, కుమారస్వామి, బాలస్వామి, మేరాజ్, తుల్చానాయక్, మధు ఉన్నారు.


