అచ్చంపేట రూరల్: పట్టణంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక కారణాలతో పట్టణంతో పాటు వివిధ మండలాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని సాయినగర్ కాలనీ వద్ద ఉప్పునుంతలకు సరఫరా అయ్యే 33కేవీ విద్యుత్ వైరు తెగిపోయి ఛానల్‌పై పడటంతో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లోని 33కేవీ బస్ అనే పరికరం పాడైంది. దీంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అచ్చంపేట, ఉప్పునుంతల, వెల్టూరు, నడింపల్లి, అమ్రాబాద్ 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఏడీఈ శ్రీనివాసులు, ఏఈఈ ఆంజనేయులు, ట్రాన్స్‌కో ఏఈఈ అనిల్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు చేయించి సరఫరాను పునరుద్ధరించారు.
శనేశ్వరుడికి
తైలాభిషేకాలు
కందనూలు: మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం నందివడ్డేమాన్ శనేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథశాస్త్రి వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి తిల, తైలాభిషేకలు, అష్టోత్తర పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమావాస్య శనివారం రావడం ప్రత్యేకమని.. స్వామివారిని కొలిచిన వారికి విశేష పుణ్యఫలితం కలుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు.
దేవీ శరన్నవరాత్రి
ఉత్సవాలకు ముస్తాబు
అచ్చంపేట: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఊరూరా దుర్గామాతకు విశేష పూజలు అందనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపాలను విద్యుద్దీపాలు, రకరకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అచ్చంపేటలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి, తాలూకా రెడ్డి సేవాసమితి, రక్షిత మహిళా సొసైటీ, వెలమ సంఘం, భక్త మార్కండేయ, భ్రమరాంబ ఆలయాల్లో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారు తొమ్మిది అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.


