గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Jul 29 2026 1:52 AM | Updated on Jul 29 2026 1:52 AM

నల్లమలలోని మద్దిమడుగుక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

అమ్రాబాద్‌/ మన్ననూర్‌: ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన అమ్రాబాద్‌, పదర మండలాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు. అనంతరం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పక్కనే ఉన్న గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన మద్దిమడుగు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ఆలయ సమీపంలో సంతు సేవాలాల్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టేందుకు వచ్చినట్లు చెప్పారు. రూ.100 కోట్లతో సంతు సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ఏర్పాటుతోపాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనల మేరకు అటవీశాఖ అడ్డంకులు లేని ప్రతి చెంచు పెంట, గిరిజన తండాలకు రోడ్లు వేయిస్తామన్నారు. పదర నుంచి మద్దిమడుగు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి మద్దిమడుగు వచ్చి హరిత హోటల్‌తోపాటు సంతు సేవాలాల్‌ విగ్రహం ఏర్పాటు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మద్దిమడుగు వరకు మంత్రి సహకారంతో ఏడాదిలోగా డబుల్‌ రోడ్డు పూర్తి చేస్తానన్నారు.

భవన నిర్మాణానికి శంకుస్థాపన

మన్ననూర్‌లో రూ.9.30 కోట్లతో నిర్మించనున్న పీటీజీ పాఠశాల భవనానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్లే గ్రౌండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. అంతకు ముందు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి.. డార్మెంటరీ, కిచెన్‌, భోజనాలు, తాగునీటి సౌకర్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన విద్యా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, జెడ్పీసీఈఓ గోపాల్‌నాయక్‌, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ రజిత, వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, ఆర్సీఓ కల్యాణి, ఆర్డీఓ యాదగిరి, మద్దిమడుగు ఆలయ ఈఓ రంగారావు, సర్పంచ్‌ మంజుల, ఉప సర్పంచ్‌ రమణగౌడ్‌, ఎంపీడీఓ రామన్న, ప్రిన్సిపల్‌ సాయిబాబుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement