పల్లెల్లోనే ఓటరు నమోదుకు మొగ్గు
● స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం
● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్
● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు
పట్టణాల్లో మందకొడిగా..
సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్‌చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్‌ఓలు వాపోతున్నారు.
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్‌వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అందిస్తున్నారు.
అసలైన ఓటర్లు 75 – 85 శాతమే..
ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్‌ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. బీఎల్‌ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేయాలి. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్‌గా షిఫ్ట్ అయినట్లు గుర్తించాలి. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్‌గా పేర్కొన్నాలి. ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం అన్‌కలెక్టబుల్
మహబూబ్‌నగర్ 7,32,488 5,93,167 86.12 55,743
నాగర్‌కర్నూల్ 7,31,632 5,80,793 79.38 56,482
వనపర్తి 2,75,570 2,18,488 79.29 16,515
జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 83.32 43,961
నారాయణపేట 4,95,574 3,93,911 79.49 45,959
మొత్తం 27,39,123 22,06,332 80.54 2,18,660
ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా..


