నాగర్‌కర్నూల్: ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు, రైతులను అప్రమత్తం చేయడం, ముందస్తు చర్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న అన్ని జీపీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామసభల్లో రైతులు, గ్రామస్తులకు ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
‘పసరంటిన కొడవలి’ పుస్తకావిష్కరణ
కందనూలు: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రచయిత వనపట్ల సుబ్బయ్య రచించిన పసరంటిన కొడవలి పుస్తకాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మల జీవిత చరిత్ర, తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. మానవ సంబంధాలను పెంపొందించుకుని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రొ.కోటేశ్వర్‌రావు, వహిద్‌ఖాన్, వనపట్ల సర్పంచ్ వాసుదేవుడు, కోట్ల నిరంజన్‌రెడ్డి, కొండకింది మన్యపురెడ్డి, కవులు తగుళ్ల గోపాల్, ఎదిరెపల్లి కాశన్న పాల్గొన్నారు.
పక్కాగా ఆరోగ్య సర్వే
కందనూలు: ఆరోగ్య సర్వేలో భాగంగా వైద్యసిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి.. ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.భరత్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు, ఈశ్వర్ కాలనీల్లో ఆరోగ్య సర్వేను ఆయన పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలన్నారు. అదే విధంగా టీబీ, పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి వివరాలతో పాటు గర్బిణుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆయన సూచించారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, ఉపాధ్యాయ పోస్టులను భరీ చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సతీష్, సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, మల్లయ్య ఉన్నారు.
నేడు హుండీ లెక్కింపు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లోని హుండీని సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.


