జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హెల్త్‌కార్డులు ఎప్పుడిస్తారు?

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి 1.5 శాతం వేతనంలో కోత విధిస్తూ హెల్త్‌కార్డులు జారీ చేయకపోవడం తగదని ఎస్‌జీపీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక టీఎన్‌జీఓల భవనంలో నిర్వహించిన స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (ఎస్‌జీపీఏటీ) కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంతవరకు ప్రైవేట్‌ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోకుండా, హెల్త్‌కార్డులు జారీ చేయకుండా కాలం గడుపుతోందని ఆరోపించారు. అంతేగాక వైద్యం తమకు తాముగా చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్‌ ఆపేస్తామనడం సరికాదన్నారు. రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైద్యసేవలు అందక, పెన్షన్‌ బకాయిలు రాక వంద మందికిపైగా మృతిచెందినా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, బాలస్వామి, వెంకటస్వామి, సురేష్‌, అంజిలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement