చారకొండ: గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించి.. తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 237వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గోడును అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాసితులు ప్రకాశ్, పర్వతాలు, నాగయ్య నాయక్, శ్రీరాం, పెద్దయ్య, గోపి, సంజీవ, ఎల్లమ్మ పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు పోరాటం
కొల్లాపూర్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు ఎంప్లాయిస్ యూనియన్ పోరాడుతోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. త్వరలో జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఆయన సమక్షంలో టీఎంయూ, టీజేఎంయూ సంఘాలకు చెందిన 70 మంది ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు. సమావేశంలో యూనియన్ డిపో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా సిబ్బది నర్సింహారావు, అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ మద్దిలేటి, కోశాధికారిగా సాయిఈశ్వర్, ప్రచార కార్యదర్శులుగా నిస్సార్‌పాష, రామకృష్ణ, నిరంజన్, ముఖ్య సలహాదారులుగా రామయ్యయాదవ్, జీఎం కృష్ణను ఎన్నుకున్నట్లు తెలిపారు.


