రంగంలోకి కలెక్టర్..
20 మండలాల్లో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ మాత్రమే
● జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జి బాధ్యతలు
● పాఠశాలల నిర్వహణ, విద్యాపరమైన వ్యవహారాలతో పని ఒత్తిడి
● గాడితప్పుతున్న విద్యావ్యవస్థ
●
దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీ అంశాన్ని విద్యాశాఖ పట్టించుకోకపోవడం విచారకరం. జీహెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలతో పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఈఓల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి.
– మల్లిఖార్జున్, తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గి విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడి పెరిగి పూర్తి పర్యవేక్షణ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి ఎంఈఓలను నియమించాలి. – మధుసూదన్,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇన్‌చార్జి ఎంఈఓలు ఉండటంతో ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి.
– బంగారుబాబు,
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రెగ్యులర్ ఎంఈఓల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. ప్రభుత్వ పాఠశాాలలపై పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. అందరి సమన్వయంతో బడుల బలోపేతానికి కృషి చేస్తాం.
– రమేశ్‌కుమార్, డీఈఓ
కందనూలు: సర్కారు పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యాపరమైన వ్యవహారాల పర్యవేక్షణ నానాటికీ కొరవడుతోంది. జిల్లావ్యాప్తంగా ఒక మండలంలో తప్ప.. మిగతా అన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో విద్యావ్యవస్థ గాడితప్పుతుందోన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతా ఇన్‌చార్జీలే..
జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 495, ప్రాథమికోన్నత 124, ఉన్నత పాఠశాలలు 130 ఉన్నాయి. ఒక కల్వకుర్తి మండలంలో మాత్రమే శంకర్‌నాయక్ రెగ్యులర్ ఎంఈఓ ఉండగా.. మిగతా 19 మండలాల్లో జీహెచ్‌ఎంలు ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఎమ్మార్సీలో ఎంఈఓతో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌తో పాటు రాత్రి కాపలాదారు ఒకరు ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం ఒక్క విద్యాధికారి మాత్రమే అన్ని తానై పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యవసర పని నిమిత్తం ఎంఈఓ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ వారు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తనిఖీలు.. చర్యలు శూన్యం
ప్రైవేటు విద్యాసంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది. అయితే జిల్లాలో కేవలం ప్రభుత్వ బడుల పర్యవేక్షణకు పరిమితమవుతూ.. ప్రైవేటు పాఠశాలల తనిఖీలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల మేరకు యాజమాన్యాలు బోధనకు సంబంధించి విద్యార్హతల వివరాలు యూడైస్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు అనర్హులతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. బోధనా ప్రమాణాలు పాటించని ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో విద్యాధికారులు, ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా ఉండకపోవడంతో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షకు మండల విద్యాధికారులు కిందిస్థాయి ఉద్యోగులు, స్కూల్ అసిస్టెంట్లను పంపించడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఓ ఎంఈఓపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల పనితీరుపై సైతం కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఆ ప్రాంత ఉపాధ్యాయుల డిప్యూటేషన్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రంగంలోకి దిగి.. తరచుగా పాఠశాలల తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖలో మార్పు వస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


