నాగర్‌కర్నూల్/కందనూలు: సోలార్ ఇంధన వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రోత్సహిస్తూ.. గ్రీన్ ఎనర్జీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో గ్రీన్ ఎనర్జీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయ పంపుసెట్లను కూడా దశలవారీగా సోలార్ విద్యుత్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. తద్వారా రైతులపై విద్యుత్ భారం తగ్గడమే కాకుండా.. నిరంతర విద్యుత్ సరఫరాకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో విజయవంతంగా అమలవుతున్న సోలార్ విద్యుత్ నమూనాను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, తూడుకుర్తిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. సోలార్ ఎనర్జీ ఏర్పాటుకు 639 ఇళ్లను గుర్తించి, ఇప్పటికే 78 ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగిందని అధికారులు వివరించారు. అలాగే కొండారెడ్డిపల్లిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్, 101 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్‌శాఖ అధికారి మోహన్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్ ఉన్నారు.
జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనను కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షయ నివారణకు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైతే అక్కడికక్కడే శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. తద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, బాధితులకు సత్వర చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం జరగకుండా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సహాయం, ఉచిత మందులు, వైద్య పరీక్షలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని మండల వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ ఉన్నారు.


