మూడు దశల్లో పరిశీలన..
రాయితీపై ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు సమీపిస్తున్న గడువు
అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం
అచ్చంపేట: అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్–2020 స్కీం కింద ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్లాట్ల యజమానులు గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి.. రాయితీ పొందాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 2020లో చేసిన దరఖాస్తుదారుల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మరికొందరు ప్లాట్లను విక్రయించారు. రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే.. అంతంత మాత్రంగానే ముందుకొచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీలకు దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపులు మాత్రం అంతంత మాత్రమే. ఇందుకు మున్సిపల్ అధికారుల అలసత్వం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతోనే ఈ ప్రక్రియ ఆశాజనకంగా సాగడం లేదు. అప్పట్లో చాలా మందికి ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునే విధానం తెలియకపోవంతో దరఖాస్తు చేసుకోని ప్లాట్లు కూడా జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. వీటికి కూడా అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరతుంని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేఽశంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అమలుచేసింది. 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపాలిటీలు వెనకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడం వల్ల చాలా మంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో కేవలం బ్యానర్ల ద్వారా కొద్దిరోజులు ప్రచారం చేసి వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా గడువు ముగిసే సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరే అవకాశం కనిపించడం లేదు. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రకియ పూర్తిచేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్థికంగా లబ్ధిపొందాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 31తో ముగియనున్న
రాయితీ అవకాశం
ఇంకా చాలా మంది ముందుకు
రాకపోవడంతో పెండింగ్‌లోనే..
చివరి అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలంటున్న అధికారులు
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతున్నారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్లను పరిశీలించి.. నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సి ఉంది. అనంతరం రెండో దశ మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. చివరి దశలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు.


