కల్వకుర్తి రూరల్: ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయ వ్యవహారం కలకలం రేపిన విషయం విదితమే. తాజాగా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో నకిలీ ఎరువులు లభించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్‌లో డీఏపీకి అధికంగా డిమాండ్ ఉండటంతో పాటు కొందరు రైతులకు నకిలీ ఎరువును అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. లింగసానిపల్లిలో నకిలీ డీఏపీ బస్తాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు రాములు, జంగయ్య ఇళ్లలో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 45 డీఏపీ బస్తాలను గుర్తించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే నెల రోజుల క్రితం గ్రామానికి డీసీఎంలో తీసుకొచ్చిన డీఏపీని నలుగురు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇద్దరు రైతులు నకిలీ డీఏపీని వినియోగించగా.. మరో ఇద్దరు ఇళ్లలో నిల్వ చేసుకున్నట్లు ఏఓ తెలిపారు. నికిలీ ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొన్నారు.


