వెల్దండ: సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల ఓటు హక్కును కాపాడే బాధ్యత బీఎల్‌ఓలదేనని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఓలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను నమోదుచేసి ఓటును కాపాడాలన్నారు. ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, నాగులునాయక్, విజయ్‌గౌడు, నిరంజన్, శ్రీనివాస్‌రెడ్డి, హనుమంతు నాయక్, అశోక్, అంజి మాస్టర్, కొండల్, శక్రునాయక్ ఉన్నారు.
అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు
కందనూలు: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న సాయంత్రం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. 28న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 29న పౌర్ణమి గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై 30వ తేదీన నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ. 2,400 చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కొల్లాపూర్ నుంచి గోవాకు ప్రత్యేక బస్సు
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి బస్సు సేవలు ప్రారంభమవుతాయని.. ఒక్కో ప్రయాణికుడికి రాను పోను చార్జీ రూ. 3వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు కొల్లాపూర్ నుంచి బస్సు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం గోవాకు చేరుకుంటుందన్నారు. 28న సాయంత్రం 6 గంటలకు బస్సు తిరుగు ప్రయాణమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కొల్లాపూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. బస్సు టికెట్లు బుక్ చేసుకునేందుకు స్థానిక బస్టాండ్‌లో సంప్రదించాలని డీఎం సూచించారు.


