● ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
● డ్రైవర్ దుర్మరణం
● 14 మంది ప్రయాణికులకు గాయాలు
● ఎన్‌హెచ్–167పై ఘటన
తాడూరు: ముందు వెళ్తున్న బైక్‌ను అతివేగంతో ఓవర్‌టెక్ చేయబోయిన స్కార్పియో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారులోని 167వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆమనగల్ మండలం కోనాపూర్‌కు చెందిన శరత్‌గౌడ్ (28) స్కార్పియో కారులో నాగర్‌కర్నూల్ వైపు బయలుదేరాడు. గుంతకోడూరు సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయి.. డ్రైవర్ శరత్‌గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనదారుడు కోట శ్రీనివాస్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి డిపో మేనేజర్ శాలిని, తాడూరు ఏఎస్‌ఐ బాలునాయక్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


