విద్యార్థులు సామాజిక అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సామాజిక అవగాహన పెంచుకోవాలి

May 31 2026 12:54 AM | Updated on May 31 2026 12:54 AM

కందనూలు: విద్యార్థులు సామాజిక అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల ముగింపు వేడుకల్లో స్నేహ కిశోర బాలికలు నిర్వహించిన మాక్‌ పార్లమెంట్‌ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాలికలు వివిధ రాజ్యాంగ పదవులైన హోం, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి పోషించి.. మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికల్లో నాయకత్వ, సామాజిక అవగాహన వంటి లక్షణాలను పెంపొందించుకొని స్వీయ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. బాలికలు చిన్న వయస్సులోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం భవిష్యత్‌ నాయకత్వానికి బలమైన పునాది అవుతుందన్నారు. బాలికలు వాక్చాతుర్యంతో నిర్భయంగా మాట్లాడడానికి ఒక వేదిక అవసరమని, ఇలాంటి వేదికల ద్వారా బాలికల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం వంటి నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు, ఏపీడీ రాజేశ్వరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

వేగవంతంగా టీపీఎస్‌ పనులు

వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. మండలంలోని వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న టీపీఎస్‌ స్కూళ్ల పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీపీఎస్‌లో తరగతి గదులు, లైబ్రరీ, ఆట స్థలాలు, తాగునీటి సదుపాయాలు, భోజన వసతి తదితర నిర్మాణాల గురించి.. ఇంజినీరింగ్‌ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ దేవసహాయం, రైతు కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌ రెడ్డి, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ రాజేశ్వరి, సర్పంచ్‌ వెంకటయ్య, ఉపసర్పంచ్‌ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0000709038-000001-SVS HOSPITAL

8.00x8.00

SVS HOSPITAL

Advertisement
 
Advertisement
Advertisement