వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి

May 31 2026 12:54 AM | Updated on May 31 2026 12:54 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్‌ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్‌ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్‌ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్‌ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్‌ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రను ఆదేశించారు. జూన్‌ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు.

రైతు పండించిన ప్రతిగింజను

కొనుగోలు చేస్తాం

తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం

4, 5 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రాజెక్టుల సందర్శన

రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement