పోక్సో.. కాస్కో | - | Sakshi
Sakshi News home page

పోక్సో.. కాస్కో

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

ఉమ్మడి జిల్లాలో బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు

అవగాహన కల్పిస్తున్నాం..

మహబూబ్‌నగర్‌ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్‌ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు.

గురువులు సైతం వక్ర బుద్ధి

ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి.

బెయిల్‌ దొరకడం కష్టమే..

పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్‌ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి.

శిక్షలు పడిన పలు కేసులు ఇలా..

మిడ్జిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్‌ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్‌ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్‌ తాలిబ్‌, సయ్యద్‌ అల్తాప్‌లకు వాట్సాప్‌లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్‌ తాలిబ్‌, ఏ3 సయ్యద్‌ అల్తాప్‌కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు.

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2020

నుంచి పోక్సో కేసులు ఇలా..

ఏడాది నమోదైన శిక్షపడిన

కేసులు వారు

2020 60 0

2021 71 0

2022 86 0

2023 91 0

2024 105 0

2025 82 0

2026 22 1

మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని

ధర్మాపూర్‌ పాఠశాలతోపాటు షాసాబ్‌గుట్ట,

వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో వీరన్నపేట హైస్కూల్‌లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక

దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు

నమోదయ్యాయి.’

2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సో కేసులు

ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 758 కేసులు నమోదు

కీచకులుగా మారుతున్న

కొందరు ఉపాధ్యాయులు

పకడ్బందీగా చట్టం అమలుతో

నిందితులకు కఠిన శిక్షలు

అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్‌ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి.

– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement