తొలి విడతలో ఇదీ పరిస్థితి..
జిల్లాకు మరో 8 వేల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు
ప్రభుత్వం మొదటి విడతలో జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టని వారికి నిర్మాణాలు చేపట్టాలని, లేని పక్షంలో రద్దు చేస్తామని నోటీసులు ఇచ్చాం. మరోసారి నోటీసులు ఇచ్చి ప్రారంభించకుంటే రద్దు చేస్తాం.
– సంగప్ప, పీడీ, గృహ నిర్మాణ శాఖ
అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌లో ఒక్కో నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాకు ఈ విడతలో మరో 8 వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. వీటిపై అర్హులైన నిరుపేదలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి విడతకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం గమనార్హం.
చెంచులకు ప్రత్యేకంగా..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు కలిపి 8 వేల ఇళ్లు మంజూరు కానుండగా.. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని చెంచులకు ప్రత్యేకంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన ఈ రెండు నియోజకవర్గాలకు 5 వేల ఇళ్ల మంజూరయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తే మరిన్ని కేటాయించవచ్చు.
అసంపూర్తి ఇళ్లకు..
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు సైతం ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చింది. నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు కాగా.. 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్ బట్టి దశల వారీగా మొత్తం రూ.5 లక్షలు చెల్లించనుంది. 500 ఇళ్లను గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇతర కారణాలతో అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున సహాయం చేయనున్నారు.
ఎంపికకు క్షేత్రస్థాయి సర్వే..
జిల్లావ్యాప్తంగా 2,33,124 మంది దరఖాస్తులు చేసుకోగా 1,29,392 మంది పక్కా ఇళ్లు కలిగి ఉన్నారు. ఇంటి స్థలం కలిగి ఇళ్లు లేని (ఎల్–1) వారు 56,486 మంది, ఇంటి స్థలం, ఇళ్లు లేనివారు (ఎల్–2) 15,812 మంది, ఇతరులు (ఎల్–3) 31,434 మంది ఉన్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇందులో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే చేపట్టారు. ఇందుకోసం వివిధ శాఖల మండల స్థాయి అధికారులను నియమించారు. వీరికి ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించగా.. వీరు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపడుతారు. ఇంటి నిర్మాణం వివరాలు, ప్రభుత్వ ఉద్యోగం, నెలకు వచ్చే ఆదాయం, కారు ఉందా.. లేదా.. వంటి వివరాలపై ఆరా తీస్తారు. వాటిని యాప్‌లో నమోదు చేసి వీటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మంజూరైనవి
(ప్రొసీడింగ్స్ ఇచ్చినవి) 10,639
స్లాబ్ లెవల్ 2,772
జిల్లాకు తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ విడతలో 11,922 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 1,078 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ 4,937 ఇళ్లకు సంబంధించి కనీసం పునాదులు కూడా తీయలేదు. ఇందులో అత్యధికంగా ఆదివాసీలు, పీవీటీజీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక స్థోమత లేకపోవడం, అటవీ శాఖ పరిధిలో స్థలాలు ఉండటం, పట్టాలు లేకపోవడం వంటి కారణాలతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక స్లాబ్, రెంటల్ లెవల్‌లో ఉన్న ఇళ్లను రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్‌లో గృహ ప్రవేశాలు నిర్వహించేలా హౌసింగ్ శాఖ ప్రయత్నిస్తోంది.
జూన్ 2న శ్రీకారం చుట్టనున్న
రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కో నియోజకవర్గానికి
2 వేల చొప్పున మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న
నిరుపేద లబ్ధిదారులు
తొలి విడత నిర్మాణాలు
పూర్తి చేయాలని నిర్ణయం


