రైతులను వీడని అకాల వర్షాలు
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన
వరిధాన్యం, మొక్కజొన్న
● జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన
పెద్దకొత్తపల్లి/ కోడేరు/ తెలకపల్లి/ లింగాల: జిల్లాలో రైతులను అకాల వర్షాలు వీడటం లేదు. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులను ధాన్యం కాపాడుకోవడానికి కష్టపెడుతూ.. తడిసిన ధాన్యంతో నష్టాలు మిగిల్చుతూ.. చివరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సైతం వివిధ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్‌లో రైతు వ్యవసాయ షెడ్ రేకులు గాలివానకు కొట్టుకపోయాయి. తహసీల్దార్ శ్రీనివాసులు శుక్రవారం ఉదయం చంద్రకల్, పెద్దకొత్తపల్లి, దేవల్‌తిర్మలాపూర్ గ్రామాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
కోడేరులో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం, భారీ ఈదురు గాలులకు ధాన్యం తడిసిపోగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ప్రధాన రహదారుల వెంట భారీ చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాయిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయి.. కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి నర్సాయిపల్లిలో తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
తెలకపల్లిలోని లింగాల రోడ్డులో చెట్లు విరిగిపడగా.. పోలీసులు జేసీబీతో తొలగించారు. అలాగే ఆలేరులో రెండు గుడిసెలు, రెండు రేకుల ఇళ్లు, పెద్దూరులో వస్పరి మల్లయ్య రేకులు గాలివానకు పూర్తిగా లేచిపోయి ధ్వంసమయ్యాయి.
లింగాలతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున భీకరమైన ఈదురు గాలులతో కురిసిన వర్షంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు ఏఈ అప్పలనాయుడు తెలిపారు.


