కందనూలు: జిల్లాలో జూన్ 15 నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, జిల్లాలో చేపట్టనున్న ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాల ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అత్యంత కీలకమని, జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా ఇంటింటి సర్వేలను ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ నమోదు పరిశీలన వంటి అంశాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తామన్నారు. ఇంటింటి సర్వేలో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాల నవీకరణను పూర్తి చేస్తామని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సర్‌పై వచ్చే ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించేలా చర్యలు ఉంటాయని, జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓలు సురేష్‌బాబు, భన్సీలాల్, యాదగిరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, తహసీల్దార్లు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


