జాబ్‌మేళాకు స్పందన | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు స్పందన

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

కల్వకుర్తి టౌన్‌: పట్టణంలోని ఏటీసీ సెంటర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఐటీఐ కన్వీనర్‌ జయమ్మ తెలిపారు. శుక్రవారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొనగా.. జిల్లాలోని పలువురు నిరుద్యోగులు మేళాకు హాజరయ్యారు. జాబ్‌మేళాలో 102 మంది మొదటి రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించి చివరి రౌండుకు అర్హత సాధించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్‌ సింగ్‌, కోఆర్డినేటర్‌ చెన్నబసవ, కళాశాల ప్రిన్సిపాల్‌ జయమ్మ, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల

బలోపేతానికి చర్యలు

కందనూలు: జిల్లాలో ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బడిబయట పిల్లల గుర్తింపు, నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి, వారికి వయస్సుకు తగిన తరగతుల్లో ప్రవేశం కల్పించాలని చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ సులభతరం చేయడం, అవసరమైన పత్రాల సేకరణలో సహకారం అందించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్‌కుమార్‌, డీఐఈఓ వెంకటరమణ, సెక్టోరియల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement